మనకోసం.. ప్రపంచం నలుమూలల నుంచి!
Nov 28, 2017
15783 Views
‘వ్యాధి వచ్చాక కాదు.. రాకముందే వాటిని పసిగట్టేయాలి!’ నేటి వైద్యరంగం లక్ష్యం ఇది! ఆ లక్ష్యానికే అత్యాధునిక శాస్త్ర, సాంకేతికతని జతచేస్తున్నారు అనూరాధా ఆచార్య. జన్యు డీఎన్‌ఏ పరీక్షల ద్వారా భవిష్యత్తులో మనకొచ్చే వ్యాధులని అంచనావేసి చెబుతుంది హైదరాబాద్‌లో ఆమె స్థాపించిన ‘మ్యాప్ మై జినోమ్’ సంస్థ. క్యాన్సర్ నుంచి మధుమేహందాకా ఎన్నో వ్యాధులని ముందుగానే పసిగట్టి జాగ్రత్తలు చెప్పొచ్చని అంటారామె! ఈ సరికొత్త సాంకేతిక ఆధారిత పరిశ్రమతో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నారు. అందుకే జీఈఎస్ కూడా ఆమెని గుర్తించింది. ఓ చర్చాకార్యక్రమానికి సమన్వయకర్తగా ఉండాలంటూ ఆహ్వానించింది!
మామూలు వైద్యపరీక్షలకి మీకూ తేడా ఏమిటీ? ఈ నాలుగేళ్లలో ప్రజల్లో అవగాహన ఎంత మేరకు పెరిగింది?
మేం డీఎన్‌ఏ ఆధారంగా పరీక్షలు చేస్తాం. రక్తంతో కాదు.. ఉమ్ము ఉన్నా చాలు కేవలం పదిక్షణాల్లో పరీక్షలు పూర్తవుతాయి. దానిపై వందపేజీల రిపోర్టు ఇస్తాం. కౌన్సెలింగ్ కూడా చేస్తాం. కాకపోతే మా లక్ష్యం వ్యాధిగ్రస్తులు కాదు.. ఆరోగ్యవంతులే! భవిష్యత్తులో వాళ్లకి ఎటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందో చెప్పి.. జాగ్రత్తలూ వివరిస్తాం. నాలుగేళ్లకిందటిదాకా మేమిలా చేస్తామంటే ఎవ్వరూ నమ్మేవారు కాదు! కానీ చాలామందిలో అవగాహన పెరిగింది. పరీక్షల కోసం వస్తున్నారు. వ్యాధి నిరోధక(ప్రివెంటివ్) వైద్యసదుపాయాలపై ప్రజల్లో రోజురోజుకీ చైతన్యం పెరుగుతున్నందువల్ల మాకు మంచి భవిష్యత్తు ఉందనీ నమ్ముతున్నా!
మనదేశంలో మీలాంటి సాంకేతిక ఆధారిత పరిశ్రమల పరిస్థితి ఎలా ఉంది?
ఒకప్పటికంటే ఎంతో పరిణతి కనిపిస్తోంది. మూడేళ్లలో ఇన్‌క్యుబేషన్ సంస్థలూ, పెట్టుబడి దారులూ పెరిగారు. ఇరవై ముప్పైయేళ్లలోపు యువత పరిశ్రమల స్థాపనకి ముందుకు వస్తోంది! ప్రభుత్వ సహకారం కూడా పెరిగింది. కానీ మనం వెళ్లాల్సిన దూరం ఎంతో ఉంది. కొన్ని సవాళ్లని అధిగమించి ముందుకెళ్లాలంటే కనీసం రెండేళ్లు పట్టొచ్చు.
ఎలాంటి సవాళ్లున్నాయి? ఏరకంగా అధిగమించవచ్చు?
పెట్టుబడులు అందరికీ సమానంగా అందడం లేదు! కొన్ని సంస్థలకి వద్దంటున్నా ఎక్కువగా వచ్చిపడుతున్నాయి. ఆర్థిక సాయం అవసరమైన కంపెనీలు అత్తెసరు వనరులతోనో అసలేమీ లేకుండానో మిగిలిపోయే పరిస్థితి. ఆ విషయంలో ఓ సమన్వయం వస్తేనే.. మన సమాజానికి మేలుచేసే కొత్త ఆవిష్కరణలు వస్తాయి. ఇక మన వైద్య, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు సవరించాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే ఇలాంటి ఆవిష్కరణలు తొందరగా ప్రజల్లోకి వెళతాయి. ఇలాంటి సాంకేతిక ఆధారిత సేవలకయ్యే ఖర్చూ తగ్గుతుంది.
మహిళా పారిశ్రామికవేత్తలు జీఈఎస్ నుంచి ఏం ఆశించవచ్చు? మనకు అందే ప్రయోజనమేంటీ?
ఏదో కొత్తగా ఆవిష్కరించాలనే తపనా, దాన్ని పరిశ్రమగా తీర్చిదిద్దాలనే పట్టుదల ఉన్నవాళ్లు ప్రపంచం నలుమూలల నుంచీ వస్తారు. భావస్వారూప్యం ఉన్న వందలాదిమందిని ఒక వేదికపై చూసే అవకాశం ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి! వాళ్లతో మనకేర్పడే పరిచయాలూ, చర్చలూ కొత్త ఉత్సాహాన్ని ఇవ్వొచ్చు. మరిన్ని పరిశ్రమలూ రావొచ్చు. ఇది అందించే ఉత్తేజం పారిశ్రామిక ముఖచిత్రాన్నే మార్చే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా..
* అనూరాధ 2000లోనే ఓసిమమ్ బయోసొల్యూషన్స్ అనే సంస్థని హైదరాబాద్‌లో స్థాపించారు. అప్పటినుంచే జన్యు ఆధారిత సాంకేతిక నిపుణురాలిగా గుర్తింపు సాధించారు. మ్యాప్‌మైజినోమ్ 2013లో మొదలైంది.
* 2011లో వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సంస్థ నుంచి ‘యంగ్ గ్లోబల్ లీడర్’ అవార్డు అందుకున్నారు. 2015లో ఎకనామిక్ టైమ్స్ పత్రిక ‘విమెన్ అహెడ్’ అవార్డు అందించింది.
* ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే జీఈఎస్‌లో ఆమె గురువారం సమన్వయకర్త(మోడరేటర్)గా వ్యవహరిస్తారు. ‘ప్రయోగశాల నుంచి పరిశ్రమదాకా!’ అనే అంశంపై సాగుతుందీ చర్చ.
Originally published: EENADU