News Coverage: Mapmygenome featured in Sakshi

Aug 29, 2015

1536 Views


Mapmygenome was featured in Sakshi Telugu newspaper on August 29, 2015.

50 ఏళ్ల తర్వాత మీ ఆరోగ్యమేంటి?

భవిష్యత్తు ఆరోగ్య సమస్యలను చెప్పే మ్యాప్ మై జీనోమ్

  • 10 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టి
  • దేశంలోని 45 ఆసుపత్రులతో ఒప్పందం
  • అమెరికా, సింగపూర్ల నుంచి కూడా కస్టమర్ల రాక

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘చికిత్స కంటే నిరోధం మేలు’…! మామూలుగా చెప్పాలంటే… వ్యాధి వచ్చాక తగ్గించుకోవటం కంటే రాకుండా చూసుకోవచ్చుగా! అని అర్థం. మరి ఇదే నానుడిని వ్యాపార మంత్రంగా జపిస్తే…! అప్పుడది ‘మ్యాప్ మై జీనోమ్’ అవుతుంది. జబ్బు చేశాక మందులేసుకోవటం కంటే అసలు మనని ఎలాంటి రోగాలు.. ఏ వయసులో చుట్టుముడతాయో తెలిస్తే ఎంత బాగుంటుందో కదూ!? వ్యక్తిగత జన్యువుల ఆధారంగా భవిష్యత్తులో రాగల రోగాలను ఇప్పుడు చెప్పేయడమే మ్యాప్ మై జీనోమ్ ప్రత్యేకత అంటోంది సంస్థ సీఈఓ అనూరాధ ఆచార్య. మన దేశ సైంటిఫిక్ రీసెర్చ్ విభాగం (సీఎస్‌ఐఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ సెన్సైస్ గవర్నింగ్ బాడీలో సభ్యురాలు అనూరాధ. 2011లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డును కూడా అందుకున్నారామె.

ఇలా ఫార్మా కంపెనీలకు కాకుండా.. నేరుగా ప్రజలకు ప్రయోజనం కలిగే కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నా. పదమూడేళ్ల పాటు జీనోమిక్ శాంపిళ్లపై చేసిన పరిశోధన… సరికొత్త ఆలోచనలకు బీజం వేసింది. జన్యు పరీక్షల ద్వారా భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యల్ని ముందే చెప్పేస్తే ఎలా ఉంటుందని అనుకున్నా!! కానీ, అదంతా సులువుగా ఏమీ జరగలేదు. 2011లో నా ప్రతిపాదనకు అప్పటికే మా కంపెనీలో పెట్టుబడిదారులైన కుబేరా పార్టనర్స్, ప్రపంచ బ్యాంక్ ఒప్పుకోలేదు. మీ కొత్త ఆలోచనతో అసలు లక్ష్యం పక్కదారి పడుతుందన్నారు. రాబోయే వ్యాధులను ముందే తెలుసుకుని భయపడటం ఎందుకని కొందరు, ఆసుపత్రులుండగా వీరేం చేయగలరని మరికొందరు విమర్శించారు. దీంతో రెండేళ్ల పాటు ఇంక్యుబేటెడ్‌గా మ్యాప్ మై జీనోమ్‌ని నిర్వహించా. 2013లో ఆసిమమ్ సంస్థ నుంచి బయటికొచ్చి మ్యాప్ మై జీనోమ్ సంస్థను ప్రారంభించా.

50 ఏళ్ల తర్వాత వచ్చే రోగాలేంటో..

మ్యాప్ మై జీనోమ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే… వ్యక్తిగత జన్యువుల ఆధారంగా అప్పటి ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పడమే. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే భవిష్యత్తులో వచ్చే జబ్బులేంటో ముందుగానే వివరించడం. ఇంకా చెప్పాలంటే అప్పుడే పుట్టిన పసిగుడ్డుకు 50 ఏళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలేంటో వివరించడమన్నమాట. దీంతో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో… ఆహా రపు అలవాట్లు, జీవన శైలిలో ఎలాం టి మార్పులవసరమో తెలిసిపోతుంది. చికిత్స కంటే నిరోధమే మేలనేది మ్యాప్ మై జీనోమ్ సిద్దాంతం. వ్యాధులకు చికిత్స చేయడం మ్యాప్ మై జీనోమ్ పనికాదు. కేవలం తదుపరి చికిత్సకు సిఫారసు చేయడమే దీని పని.

పరిశోధనలే ఆధారం…

మాలిక్యులర్ డయాగ్నస్టిక్ వ్యవస్థ ద్వారా ప్రోగ్నొస్టిక్, డయాగ్నొస్టిక్ పద్ధతుల ఆధారంగా మ్యాప్ మై జీనోమ్ పరిశోధనలు చేస్తుంది. ఇందుకోసం మా దగ్గర ఎంబీబీఎస్, ఎండీ, పీహెచ్‌డీలు చేసిన వైద్యులు అందుబాటులో ఉంటారు. వారు రోగి ఆరోగ్య నివేదికను, కుటుంబ చరిత్రనూ వివరంగా తీసుకొని పరిశోధనలు చేస్తారు. ఇమ్యూన్, ఆటో ఇమ్యూన్ సమస్యలతో పాటు… రోగి కుటుంబ సభ్యులకూ పరీక్షలు చేసి వారసత్వంగా వచ్చే వ్యాధుల గురించి, వాటిని అదుపులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తాం.

ఉదాహరణకు ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతూ మందులు వాడుతుంటే అవి ఏ మేరకు పనిచేస్తున్నాయో విశ్లేషిస్తాం. తన జన్యు చరిత్ర ప్రకారం ఇంకెన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందో కూడా వివరిస్తాం. కొన్నిసార్లు సమస్య ఒకటైతే తీసుకునే మందు ఇంకోటి ఉంటుంది. మరికొన్ని సార్లు వారు తీసుకున్న మందుని శరీరం పూర్తి స్థాయిలో స్వీకరించదు కూడా. వీటన్నింటినీ మ్యాప్ మై జీనోమ్ వివరిస్తుంది.

10 మిలియన్ డాలర్ల సమీకరణ..

ఇటీవలే మ్యాప్ మై జీనోమ్‌లో పలువురు ప్రైవేటు పెట్టుబడిదారులు 1.1 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. రెండో విడతగా మరో 10 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టిసారిచాం. దీనికోసం ప్రపంచ బ్యాంకుతో సంప్రతింపులు జరుపుతున్నాం. ఎందుకంటే గతంలో నా మరో కంపెనీ ఆసిమమ్ బయో సొల్యూషన్స్‌లో ప్రపంచ బ్యాంక్, కుబేరా పార్ట్‌నర్స్ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు కూడా. ఈ ఏడాది ముగింపు నాటికి రూ.6 కోట్ల ఆదాయాన్ని చేరుకుంటాం.

దేశంలోని 45 ఆసుపత్రులతో…

ప్రస్తుతం మ్యాప్ మై జీనోమ్‌లో బ్రె యిన్ మ్యాప్, వెబ్ న్యూరో, లంగ్ క్యాన్సర్, నికోటిన్ డిపెండెన్సీ టెస్ట్, కార్డియో మ్యాప్, ఆంకోమ్యాప్, బ్రెయిన్ మ్యాప్, మైఫిట్ జినీ, స్మార్ట్‌స్పోర్ట్ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లను స్వీకరిస్తాం. రోగి ఆరోగ్య నివేదిక, డీఎన్‌ఏ నమూనాల సేకరణకు మా సిబ్బందే ఇంటికొస్తారు. సంబంధిత పరీక్షల కోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా 45 ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం.

కేర్, మణిపాల్, కిమ్స్ వంటి ఆసుపత్రులూ ఇందులో ఉన్నాయి. పరీక్షల ద్వారా ఒక్కో వ్యక్తి నుంచి సుమారు 38,000 జన్యువుల్ని లెక్కిస్తాం. సింగపూర్, మలేషియా, అమెరికా వంటి దేశాల నుంచి కూడా మా ల్యాబ్‌కి రిపోర్ట్‌లొస్తుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కార్యాలయాలున్నాయి. త్వరలోనే ముంబై, గోవాల్లోనూ ప్రారంభిస్తాం.

Sakshi | Updated: August 29, 2015 01:42 (IST)

Disclaimer: The information provided here is not exhaustive by any means. Always consult your doctor or other qualified healthcare provider with any questions you may have regarding a medical condition, procedure, or treatment, whether it is a prescription medication, over-the-counter drug, vitamin, supplement, or herbal alternative.