News Coverage: Mapmygenome featured in Namaste Telangana
Oct 06, 2015
9904 Views
Mapmygenome was featured in Namaste Telangana newspaper on October 06, 2015.
మీ ఆరోగ్య రహస్యం ఉందిక్కడ!
మీ గోత్రం ఏమిటో తెలుసా?ఒకే గోత్రంవారు ఎందుకు పెళ్లి చేసుకోరో తెలుసా?ఎందుకంటే.. వంశపారంపర్య వ్యాధులు వస్తాయని!అసలు కొన్ని వ్యాధులు వారసత్వంగా ఎందుకొస్తాయి? వంశపారంపర్యం అనే పదం వైద్య శాస్త్రంలోకి ఎందుకొచ్చింది?ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం నుంచే జన్యుశాస్త్రం అభివృద్ధి చెందింది. ఈ శాస్త్రంలో ఎంతో అనుభవం సంపాదించిన అనురాధ ఆచార్య మీ ఆరోగ్య రహస్యాన్ని విప్పి చెబుతున్నది. ఆ రహస్యం ఉన్నది.. ఇక్కడే.. మీ జన్యువుల్లోనే. మ్యాప్ మై జీనోమ్ భవిష్యత్తులో మీకు వచ్చే వ్యాధుల గురించి ముందస్తు సమాచారం మాత్రమే కాదు.. ఇంకెన్నో తెలుసుకోవచ్చు.
ఇప్పటికీ చాలామంది వంశపారంపర్య లక్షణాలకు కారణం రక్తమే అనుకుంటుంటారు. కానీ మానవుని దేహం మాత్రమే కాదు.. ఏ జీవి అయినా అనేక జీవకణాలతోనే రూపం దాల్చుతుంది. కణాల్లో జన్యువులుంటాయి. అవి డీఎన్‌ఏ అనే పదార్థాన్ని కలిగి ఉంటాయి. వారసత్వ లక్షణాలకు ఈ డీఎన్‌ఏనే కారణమని చాలా అధ్యయనాల్లో తేలింది. దీంతో డీఎన్‌ఏ గుట్టు రట్టు చేసేందుకు శాస్త్రవేత్తలు మైక్రోస్కోప్ బిగించారు. మనిషి నుంచి మరణం వరకు అన్నీ తనలోనే ఇముడ్చుకున్న ఆ మహా జన్యు ప్రపంచం గురించి చాలానే తెలుసుకున్నారు. మొదటిసారిగా అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ లూయిస్, క్రెయింగ్ వెంటర్‌లు అర్థం చేసుకున్న తర్వాత.. దాని ఫలితంగానే మానవ జన్యుపటం ఆవిష్కృతమైంది. మానవుల్లో వచ్చే రకరకాల వ్యాధులు, జన్యువులతో వాటికున్న సంబంధాలను తెలుసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
రహస్యాల గురించి మాత్రమే కాదు.. భవిష్యత్తులో వచ్చే రోగాల గురించి కూడా జన్యు పటం ఆధారంగా ముందస్తు సమాచారం పొందవచ్చు. సంవత్సరాల నుంచి జన్యు శాస్త్రంలో అధ్యయనాలు సాగిస్తున్న అనురాధ ఆచార్య దీన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. జబ్బు చేశాక మందులు వేసుకోవడం కంటే.. అసలు మనల్ని ఎలాంటి రోగాలు.. ఏ వయసులో చుట్టు ముడతాయో తెలుసుకుంటే బావుంటుంది కదా..! చికిత్స కంటే నిరోధం మేలు.. అనే దానికి ఎవరైనా కనెక్ట్ అవుతారు. సో.. దీన్నే ఒక అవకాశంగా భావిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అని కలగన్నది. ఆ కలను నిజం చేసుకునేందుకు మ్యా మై జీనోమ్‌ను ప్రారంభించింది. అనుకున్నట్లుగానే ఆమె కల నిజమైంది. విజయం వరించింది. అంతర్జాతీయంగా అనురాధ ఇప్పుడు గుర్తింపు పొందింది. వచ్చే రోగాలను వ్యక్తిగత జన్యువుల ఆధారంగా ఇప్పుడు చెప్పేయడమే మ్యాప్ మై జీనోమ్ ప్రత్యేకత.
ఒక్క ముక్కలో మ్యాప్ మై జీనోమ్ ఏం చేస్తుందో చెప్పాలంటే.. మీ ఆరోగ్య రహస్యాలను చెబుతుందన్నమాట. అదెలాగా.. అంటారా? మీరు ఈ పరీక్ష చేయించుకోవాలంటే ద్వారా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఆరోగ్య నివేదిక, డీఎన్‌ఏ నమూనాల సేకరణ కోసం మ్యాప్ మై జీనోమ్ సిబ్బందే మీ వద్దకు వస్తుంది. సంబంధిత పరీక్షల కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని హాస్పిటల్స్‌తో వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. కేర్, కిమ్స్ లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. పరీక్షల ద్వారా ఒక్కో వ్యక్తి నుంచి సుమారు 38, 000 జన్యువుల్ని లెక్క తీస్తారు. మాలిక్యులర్ డయాగ్నస్టిక్ వ్యవస్థ ద్వారా ప్రోగ్నొస్టిక్, డయాగ్నొస్టిక్ పద్ధతుల ఆధారంగా మ్యాప్ మై జీనోమ్ మీ జన్యువులపై పరిశోధనలు చేస్తుంది. ఇందుకోసం ఎంబీబీఎస్, ఎండీ, పీహెచ్‌డీలు చేసిన వైద్యులు అందుబాటులో ఉంటారు.
వారు రోగి ఆరోగ్య నివేదికను, కుటుంబ చరిత్రనూ వివరంగా తీసుకొని పరిశోధనలు చేస్తారు. ఇమ్యూన్, ఆటో ఇమ్యూన్ సమస్యలతో పాటు.. రోగి కుటుంబ సభ్యులకూ పరీక్షలు చేసి వారసత్వంగా.. వచ్చే వ్యాధుల గురించి వాటిని అదుపులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి మీకు నివేదిక తయారు చేసి ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగా మీరు ముందే మరింత జాగ్రత్త పడొచ్చు. అంటే.. ఉదాహరణకు మీరు మధుమేహంతో బాధపడుతూ మందులు వాడుతున్నారు అనుకుందాం. మీ జన్యు పటం ద్వారా మీరు వాడుతున్న మందులు ఏ మేరకు పనిచేస్తున్నాయో విశ్లేషిస్తారన్నమాట. మీ జన్యు చరిత్ర ప్రకారం ఇంకెన్ని రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో కూడా తెలియజేస్తారు. సమస్య ఒకటైతే తీసుకునే మందు ఇంకోటి ఉంటుంది. మరి కొన్నిసార్లు మీరు తీసుకున్న మందుని శరీరం పూర్తి స్థాయిలో స్వీకరించదు కూడా. ఇలాంటి వాటన్నింటినీ మ్యాప్ మై జీనోమ్ ముందుగానే వివరిస్తుంది.
చికిత్స కంటే నిరోధమే మేలనేది మ్యాప్ మై జీనోమ్ సిద్ధాంతం. వ్యాధులకు చికిత్స చేయడం మ్యాప్ మై జీనోమ్ పని కాదు.. కేవలం తదుపరి చికిత్సకు సిఫారసు చేయడమే దీని పని. వ్యక్తిగత జన్యువుల ఆధారంగా అప్పటి ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పడమే.. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే భవిష్యత్తులో వచ్చే జబ్బులేంటో ముందుగానే వివరించడం. ఇంకా చెప్పాలంటే అప్పుడే పుట్టిన పసిబిడ్డకు ఏళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలేమిటో వివరించడమన్నమాట. దీంతో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో.. ఆహారపు అలవాట్లు.. జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో.. మున్ముందు చేసుకోవాల్సిన అవసరం ఏ మేరకు ఉందో తెలిసి పోతుంది.
అనురాధ మన దేశ సైంటిఫిక్ రీసెర్చ్ విభాగం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో మెడికల్ సైన్సెస్ గవర్నింగ్ బాడీలో సభ్యురాలు. ఈమె మ్యాప్ మై జీనోమ్ స్థాపన వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉన్నది. 2011లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న అనురాధ పుట్టి పెరిగింది రాజస్థాన్‌లో. ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి పట్టా తీసుకున్నది. తరువాత అమెరికాలో ఎంఎస్, ఎంఐఎస్ పూర్తి చేసింది. కుటుంబ ఆర్థిక పరిస్థతుల రీత్యా చదివిన చదువుకు సంబంధం లేకుండా ఓ టెలికాం కంపెనీలో కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది. కానీ జీవితంలో ఏదో కోల్పోతున్నాననే బెంగ ఆమెను వెంటాడేది. తనకంటూ ఒక సొంత కంపెనీ ఉండాలని. అది కూడా తన చదువుకు సంబంధించినదైతే బాగుంటుందని ఆమె ఎప్పుడూ ఆలోచించేది. ఆ ఆలోచనల నుంచే ఒసిమమ్ బయోసొల్యూషన్స్ సంస్థను ప్రారంభించింది.
ఫార్మా సంస్థలకు జీనోమిక్ రీసెర్చ్ చేయడం ఈ సంస్థ పని. కానీ ఈ పని సబ్‌కాంట్రాక్ట్ కింద చేయాల్సి రావడంతో ఆమె మనసులో ఏదో వెలితి మొదలైంది. తన పని వల్ల కంపెనీలకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నది. దాని ఫలితాన్ని మాత్రం ఆమె తక్కువగా పొందుతున్నది. ఇది అర్థం చేసుకున్నప్పుడే ఫార్మా కంపెనీలకు కాకుండా.. నేరుగా ప్రజలకు ప్రయోజనం కలిగే కంపెనీ ప్రారంభించాలని అనురాధ నిర్ణయించుకున్నది. పదమూడేళ్ల పాటు జీనోమిక్ శాంపిళ్లపై ఆమె చేసిన పరిరిశోధనలు.. సరికొత్త ఆలోచనకు బీజం వేసింది. జన్యు పరీక్షల ద్వారా భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యల్ని ముందే చెప్పేస్తే ఎలా ఉంటుందని అనుకున్నది. కానీ ఇది అనుకున్నంత సులువుగా అయ్యే పని కాదు. 2011లో ఆమె ప్రతిపాదనకు పెట్టుబడులు దొరకలేదు. మీ కొత్త ఆలోచనతో అసలు లక్ష్యం పక్కదారి పడుతుందన్నారు కొందరు. రాబోయే వ్యాధులను ముందే తెలుసుకుని భయపడటం ఎందుకని మరికొందరు అడ్డు చెప్పారు. హాస్పిటల్స్ ఉండగా మీరేం చేయగలరని ఇంకొందరు విమర్శించారు.
ఇవేమీ పట్టించుకోకుండా.. సీడ్ ఫండింగ్ సంపాదించింది అనురాధ. దీంతో రెండేళ్ల పాటు ఇంక్యుబేటెడ్‌గా మ్యాప్ మై జీనోమ్‌ని నిర్వహించింది. 2013లో ఒసిమమ్ సంస్థ నుంచి పూర్తిగా బయటికొచ్చి మ్యాప్ మై జీనోమ్ సంస్థను ప్రారంభించింది. ఇటీవలే మ్యాప్ మై జీనోమ్‌లో పలువురు ప్రైవేటు పెట్టుబడిదారులు మిలియన్ డాలర్ల పెట్టుబడులుగా పెట్టారు. రెండో విడతగా మరో 10 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై అనురాధ దృష్టి సారించారు. అంతర్జాతీయంగా ఆదరణ పొందుతున్న మ్యాప్ మై జీనోమ్ కోసం అనురాధ ప్రపంచ బ్యాంకుతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. జీనోమ్ మ్యాపింగ్ ద్వారా..
మధుమేహం, హృద్రోగం, లివర్, కిడ్నీ, మోకాళ్ల నొప్పులు, బట్టతల, క్యాన్సర్ లాంటి జబ్బుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఏఏ డ్రగ్స్‌కు ఎలా రియాక్ట్ అవుతారో కూడా గుర్తించవచ్చు.
జన్యు నివేదికల్లో 99.9 శాతం కచ్చితత్వం ఉంటుంది. ఇందుకోసం అత్యుత్తమమైన ఇల్యూమినా మెషీన్లు వాడుతున్నారు. రిపోర్టు నాణ్యతలో రాజీ పడరు.
ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కార్యాలయాలున్నాయి. త్వరలోనే ముంబై, గోవాల్లోనూ ప్రారంభించనున్నారు. సింగపూర్, మలేషియా, అమెరికా వంటి దేశాల నుంచి కూడా ల్యాబ్‌కి రిపొర్ట్‌లొస్తుంటాయి.
జీనోమ్ పత్రి : ఒక రకంగా ఇది హెల్త్ హిరోస్కోప్ లాంటిది. జినోమ్ పత్రి ద్వారా శాస్త్రీయమైన వ్యక్తిగత ఆరోగ్య వివరాలు వెల్లడవుతాయి. జీనోమ్ పత్రి ద్వారా ఆయా వ్యక్తులకు సంబంధించిన దాదాపు 100 లక్షణాలను క్రోడీకరిస్తారు.
మ్యాప్ మై జీనోమ్ ఉత్పత్తులు..
ప్రస్తుతం మ్యాప్ మై జీనోమ్ బ్రెయిన్ మ్యాప్, వెబ్ న్యూరో, లంగ్ క్యాన్సర్, నికోటిన్ డిపెండెన్సీ టెస్ట్, కార్డియో మ్యాప్, అంకో మ్యాప్, బ్రెయిన్ మ్యాప్, మై ఫిట్ జినీ, మార్ట సోపర్ట్ వంటి 47 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మీరూ ఈ ఉత్పత్తులను పొందేందుకు.. రకరకాల జన్యుపరీక్షలు చేయించుకునేందుకు mapmygenome.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.